Tuesday, May 25, 2021

 ఆనందయ్య మందుకు గ్రీన్‌ సిగ్నల్‌



నెల్లూరు జిల్లా కృష్ణప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( సీసీఆర్‌ఏఎస్‌) క‌మిటీ నివేదిక ప్ర‌కారం ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కంట్లో వేస్తున్న మందుకు త‌ప్ప ఆనంద‌య్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 


పంపిణీ వద్దకు కొవిడ్‌ రోగులు వెళ్లొద్దు..


కంట్లో వేసే డ్రాప్స్‌కు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. అవి రావ‌డానికి 2- 3 వారాలు స‌మ‌యం ప‌డుతుంద‌ని వివ‌రించింది. కె అనే మందును క‌మిటీ ముందు ప్రదర్శించనందున సీసీఆర్‌ఏఎస్‌ దీనికి నిరాక‌రించింది. ఆనంద‌య్య మందు వాడితే క‌రోనా త‌గ్గుతుంద‌నడానికి నిర్ధార‌ణ‌లు లేవ‌ని నివేదిక‌లు తేల్చాయి.


ఈ మందు వాడినంత మాత్రాన మిగ‌తా మందులు వాడ‌కుండా ఉండొద్ద‌ని ప్ర‌భుత్వం సూచించింది. ఈ క్ర‌మంలో ఆనంద‌య్య ఇచ్చే పి,ఎల్‌,ఎఫ్ మందులు వాడొచ్చ‌ని స్పష్టం చేసింది. ఆనంద‌య్య ఔష‌ధం కోసం పంపిణీ కేంద్రం వద్దకు కొవిడ్ రోగులు వెళ్లొద్ద‌ని.. వారి బంధువులే వెళ్లాలని సూచించింది. మందు పంపిణీ వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్ర‌భుత్వం ఆదేశించింది. 


హైకోర్టులో విచారణ


అంత‌క‌ముందు ఆయుర్వేద మందును ప్ర‌భుత్వ‌మే పంపిణీ చేయాలంటూ ఆనంద‌య్యతో పాటు మరో ఇద్దరు వేసిన పిటిష‌న్‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఔష‌ధంపై రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం తెల‌పాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాదిని కోర్టు కోరింది. ఈ విష‌యంపై ఈరోజు ప్ర‌భుత్వం స‌మీక్ష జ‌రుపుతుంద‌ని న్యాయ‌వాది వివ‌రించారు. చ‌ట్ట‌ ప్ర‌కారం ఆనంద‌య్య మందు పంపిణీకి ప్ర‌భుత్వం అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని ఆనంద‌య్య త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టులో వాదించారు. వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం విచార‌ణ‌ను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వాయిదా వేసింది. ఈలోపు ఆనంద‌య్య మందుకు అనుమ‌తిచ్చిన నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం అధికారికంగా హైకోర్టుకు తెలిపే అవకాశముంది.